ఇది కదా అసలైన సంతోషం అంటే!

Family is Everything.

Devil Writes

11/29/20241 min read

photo of two man and one woman standing near tree
photo of two man and one woman standing near tree

ఓ దేవుడా మరో జన్మలో నన్ను డ్రైవర్ గా పుట్టించమని కోరుకున్న కోటీశ్వరుడు...

ఒక కార్పొరేట్ కంపెనీలో అత్యున్నతాధికారి చిదంబరం.యాభై ఏళ్ళుంటాయి. ఏడాదికి కోటిన్నరపైగానే వస్తాయి జీతభత్యాలు. వారం రోజులు ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ కు హాజరైన తరువాత రాత్రి ఎనిమిది గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు.

గంటన్నరలో ఇంటికొస్తున్నట్లు భార్యకు ఫోన్ చేశాడు.

కంపెనీ కారు డ్రైవర్ ఎదురొచ్చి వినయంగా నమస్కరించి లగేజ్ అందుకుని డిక్కీలో పెట్టాడు. కార్ కదిలింది. విపరీతంగా ట్రాఫిక్ జామ్. నత్తగుల్లలా పోతున్నది కార్.

డ్రైవర్ మొబైల్ మోగింది. "త్వరగా రండి..మీకు ఇష్టమని కాకరకాయ వేపుడు, చేపల పులుసు చేసి ఉంచా" బయటకి కూడా వినిపిస్తున్నది కంఠస్వరం. అతని భార్యది. "ష్..చిన్నగా మాట్లాడు. సార్ ఉన్నారు...గంటలో వస్తా" ఆఫ్ చేసాడు డ్రైవర్.

నవ్వుకున్నాడు చిదంబరం.

పది నిముషాల తర్వాత మళ్ళీ మోగింది మొబైల్. "ఎక్కడున్నారు..తొందరగా దింపేసి రండి... బగారా రైస్ మీకు ఇష్టం కదా..చేసి ఉంచుతాను..తొందరగా రండి" వినిపిస్తున్నది గొంతు.

"సరే,...సరే... పెట్టెయ్..వస్తాలే" ఆఫ్ చేశాడు డ్రైవర్.

ఒకచోట రెడ్ సిగ్నల్ పడింది. మళ్ళీ డ్రైవర్ మొబైల్ అరిచింది. "నాన్నా...తొందరగా రా..నీ కోసమే వెయిటింగ్..ఆకలవుతుంది..ఫిష్ పులుసు అదిరిపోతోంది..." ఈసారి కూతురు...

"ఓకేనమ్మా...అరగంటలో వస్తా..నీకు ఆకలైతే తినేసేయ్" చెప్పాడు డ్రైవర్.

"ఊహూ..నువ్వు వస్తేనే తింటా ...లేకపోతె లేదు" మారాం చేస్తున్నది కూతురు.

తన మొబైల్ చెక్ చేసుకున్నాడు చిదంబరం. ఒక్క కాల్ కూడా లేదు...

అయిదు నిముషాల తరువాత మళ్ళీ మోగింది డ్రైవర్ మొబైల్. "ఏం నాన్నా ఎక్కడున్నావు..ఇంతాలస్యం అయితే ఆకలికి ఉండలేవు..తొందరగా వచ్చేయ్..నాన్న కూడా నీకోసం వాకిట్లో కూర్చుని దోమలు తోలుతున్నాడు" అది అతని తల్లి గొంతులా ఉంది.

ఏసీ కారులో కూడా చెమటలు తుడుచుకున్నాడు చిదంబరం. మళ్ళీ తన ఫోన్ చూసాడు. ఒక్క కాల్ కూడా లేదు...

ఇంటికి చేరేసరికి గంటన్నర సమయం పట్టింది. ఏడెనిమిదిసార్లు డ్రైవర్ మొబైల్ మోగింది.

బంగళాకు రాగానే డ్రైవర్ లగేజ్ దించి ఇంట్లో పెట్టాడు.. భార్య టీవీ సీరియల్ చూస్తున్నది.

డిగ్రీ చదువుతున్న కూతురు మొబైల్ చూసుకుంటున్నది. తండ్రిని ఒకసారి చూసి నవ్వి "హాయ్ డాడ్..." అని మళ్ళీ మొబైలులో మునిగింది. తల్లితండ్రులు తమ గదిలో కూర్చుని మరో టీవీలో వారికి ఇష్టమైన సీరియల్ చూస్తున్నారు.

అంతలోనే డ్రైవర్ మొబైల్ మోగింది. "సార్...గుడ్ నైట్" అన్నాడు అతను బయటకి వెళ్తూ.

భార్య నవ్వుతూ.."ఫ్లైట్ లేట్ అయినట్లుంది. ఇవాళ కాలనీ లేడీస్ మీటింగ్ కు వెళ్లడంతో ఏమీ చెయ్యలేదు. ఇప్పుడు ఇంకా తొమ్మిదిన్నరే కదా అయింది. అలా సరదాగా బావర్చి రెస్టారెంట్ కు వెళదామా?..ఫ్రెష్ అప్ అయి రండి..నేను కూడా రెడీ అవుతాను.." లేచింది భార్య.

"భగవాన్...నాకు అన్నీ ఉన్నాయి..కానీ ఏమీ లేవు. వాడికి ఏమీ లేవు. కానీ ఒక సాధారణ మనిషి కోరుకునేవి అన్నీ ఉన్నాయి. వచ్చే జన్మలో నన్ను ఆ డ్రైవర్ గా పుట్టిస్తావా?" అని మనసులో ప్రార్ధిస్తూ వాష్ రూమ్ కు వెళ్ళాడు చిదంబరం.