మంచి కుటుంబ సందేశం !

Devil Writes

11/23/20241 min read

woman in black and white striped shirt hugging girl in black and white striped shirt
woman in black and white striped shirt hugging girl in black and white striped shirt

తాత - మనుమడు - తండ్రి

ఆ రోజు ఒక పేరున్న రెష్టారెంట్ ముందు కారు లో సుమారు తొంబై దాటిన తాతగార్ని ఓ మనవడు నెమ్మదిగా చెయూత నిచ్చి నడిపించుకొని తీసుకు వచ్చాడు. ఓ మూల ఉన్న టూ సిట్టర్ టేబుల్ దగ్గరకు నడిపించుకుని జాగ్రత్తగా కూర్చోబెట్టాడు.

చెప్పండి తాతగారు ! ఏంటి తింటారు ? అని అడిగాడు మనవడు.

నాకు మటన్ చాలా ఇష్టం, కాని పళ్లు లేవుగా! ఎలా తింటాను అన్నాడు.

ఓస్ ! ఇంతే కదా ! అని బేరర్ ను పిలిచి, ఓ ప్లేట్ చాల మెత్తని మటన్ ఖైమా, బాగుండాలని ఆర్డర్ పెట్టాడు. ఇదిగో!

అది అయ్యేలోపు చికెన్ సూప్ ఫ్రెష్ గా పట్టుకు రా ! అని చెప్పాడు. ఐదు నిమిషాల్లో చికెన్ సూప్ వచ్చింది!

ఆ మనుమడు ఒక తెల్లటి టవల్ ను తాతయ్య మెడ ముందు అమర్చి, సూప్ నెమ్మదిగా స్పూన్ తో తాగిస్తున్నాడు. అయినా అది ఆ బోసి నోరు చుట్టూ అంటుకుంది. కర్చిఫ్ తో మూతి శుభ్రం చేసాడు. ఈ లోగా మటన్ ఖైమా వచ్చింది. తాతయ్యకు నెమ్మదిగా స్పూన్ తో తినడం వలన చాలా సమయం పట్టింది. ఐనా విసుగు చెందకుండా నెమ్మదిగా తాతయ్యతో కబుర్లు చెబుతూ... నానమ్మ పై జోకులు వేస్తూ తినిపించాడు. చనిపోయిన భార్య జ్ఞాపకాలు అంత అందంగా మనవడు గుర్తు చేసినందుకు, ఆ తాతయ్య కళ్లలో ఆనందం.. ఓ పక్క కంటనీరు. రెష్టారెంట్ లో అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఆ కుర్రాడు ఏమాత్రం పట్టించుకోలేదు. బిల్ పే చేసి నెమ్మదిగా మరలా నడపించుకొని తీసుకు వెళ్లిపోయాడు. కొడుకు, కోడలు చాలా మంచి వాళ్లు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుందని ఏది పడితే అది పెట్టరు. మనవడు అలా కాదు. వచ్చిన ప్రతీ సారి తాతయ్యను కార్లో వేసుకుని షికారు తిప్పడమే కాకుండా, చిన్న పిల్లలకు తినిపించినట్లు, ఐస్ క్రీమ్స్, రక రకాల చిరుతిండి తినిపిస్తాడు. తండ్రి చెప్పినా వినడు. ఒక్కరోజుకు ఏం కాదు డాడీ... నేను చూసుకుంటాను కదా అని...రాత్రి పడుకునే ముందు జీర్ణం కావడానికి పళ్ల రసం, టాబ్లెట్ వేసేస్తాడు. మామూలు సమయంలో చాలాఇబ్బంది పడే పెద్దాయన...చిత్రంగా మనవడు వచ్చినపుడు హుషారుగా ఉంటారు. ఒక్క కంప్లైంట్ కూడ ఉండదు. కొడుకు ముసి ముసిగా నవ్వుకుంటాడు. ఓసారి ఉండలేక కొడుకుని అడిగాడు...ఏరా! వచ్చినపుడల్లా తాతయ్యను కుషీ చేస్తావ్! తాతయ్య అంటే అంత ఇష్షమా?దానికి కొడుకు చెప్పిన సమాధానం. డాడీ! నా చిన్నతనంలో అమ్మా, మీరు క్షణం తీరిక లేకుండా ఉద్యోగాల వలన బిజీగా ఉండేవారు. ఇంట్లో నాన్నమ్మ తాతయ్య, నా విషయంలో చాలా శ్రద్ధ చూపేవాళ్లు. తాతయ్యా ! నన్ను స్కూల్ నుండి తీసుకొని వస్తూ, నేను ఏది అడిగితే అది కొనిచ్చి ముద్దు చేసేవారు. ఒక్కోసారి నా బట్టలు పాడు చెసేవాడిని. తాతయ్య నాన్నమ్మ ఆ రోజులలో నాకు చేసిన సేవలు గుర్తున్నాయి. నేను ఏమిచ్చి వాళ్లను ఆనంద పరచగలను. నానమ్మ ఇప్పుడు లేదుగా, అందుకే వచ్చిన ప్రతిసారీ కనీసం తాతయ్య తో ఒక్కరోజైనా గడపి నా జ్ఞాపకాలు సజీవంగా ఉంచుకుంటాను అని చెప్పాడు. సమాధానం విన్న తండ్రి కళ్లలో నీళ్లు, నీ జ్ఞాపకాల మాటేమో గాని, నీవు వచ్చిన వెంటనే తాతయ్య కళ్లలో ఉత్సాహం చూస్తుంటే నేను ఆయనకు ఎంత రుణపడి ఉన్నానో అర్ధం అవుతుంది. నాకు మీ అమ్మకు అందమైన వార్ధక్యం కళ్ల ముందు కనిపిస్తూంది. యు ఆర్ గ్రేట్ మై సన్...ఈ కథలో నీతి ఏంటి అంటే డబ్బు వెనుక పరుగులుపెట్టే ఈ కాలంలో ఇలాంటి సంబంధ బాంధవ్యాలు కాపాడుకునే కుటుంబాలు మాత్రం నిజంగా స్వర్గధామాలే. అన్ని కుటుంబాలు కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తూ! కుటుంబ వ్యవస్థ ఇలా ఉంటే సమాజం కూడా బాగుంటుందని భావిస్తూ!

మీ

@DevilWrites