ఘోరం జరిగిపోయింది!

Devil Writes

11/24/20241 min read

a couple of men standing next to each other
a couple of men standing next to each other

ఒక తాపీ మేస్త్రీ ఉండేవాడు. అతను మంచి నైపుణ్యం కలవాడు. ముప్ఫై సంవత్సరాలుగా అతను ఒక కాంట్రాక్టరు దగ్గర పని చేస్తూ వచ్చాడు. ఆ కాంట్రాక్టరుకు కూడా మేస్త్రీ అంటే చాలా అభిమానం, అందువల్లనే వాళ్ళ సంబంధం అన్ని సంవత్సరాలపాటు కొనసాగింది. చివరికి ఒక రోజున మేస్త్రీ కాంట్రాక్టరుతో చెప్పేశాడు.

అయ్యా ... ప్రస్తుతం మనం చేస్తున్న ఈ పని ఏదో అయిపోగానే, నేను ఇక రిటైరు అయిపోతాను. బాగా పెద్దవాడిని అయిపోయాను, కొంచెం బలహీనంగా కూడా అవుతున్నట్లుంది. ఇప్పుడిక పనిని చాలించాలి. మిగిలిన కొద్దిపాటి జీవితాన్ని విశ్రాంతిగా గడుపుదామని ఉన్నది. ఈ సంగతిని కొంచెం ముందుగానే తెలియజేస్తున్నాను మీకు- ఏమంటే పనిలో కష్టం కలగకూడదు గద, అందుకని” అన్నాడు. కాంట్రాక్టర్ సన్నగా నవ్వాడు.

సరేనన్నట్లు తల ఊపాడు, చేస్తున్న పనేదో ముగింపుకు వచ్చింది. పని ఆరోజుతో అయిపోతుందనగా కాంట్రాక్టరు మేస్త్రీని పిలిచి, ఈ పని అయిపోగానే రిటైరు అయిపోతానన్నావు, నేను అందుకు ఒప్పుకున్నాను కూడాను.
ఇదంతా నాకు గుర్తులేక కాదు, కానీ నాదొక చిన్న అభ్యర్థన, కాదనకు.

నాకోసం మరొక్క చక్కని ఇల్లు ఒక్కటంటే ఒక్కటి కట్టి ఇచ్చి వెళ్ళు. ఆ తర్వాత నేను ఇక నిన్ను ఆపను. మరొక్క ఇల్లు అంతే ఏమంటావు?? అన్నాడు.

మేస్త్రీకి ఈ మార్పు అస్సలు నచ్చలేదు. అయినా ఏం చేస్తాడు, చాలా కాలంపాటు పని చేసి ఉన్నాడు కాదనటానికి లేదు అందుకని అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడన్నమాటే గానీ, నిజంగా కొత్త ఇంటి పని మొదలయ్యేసరికి, మేస్త్రీకి ఆ పని పెద్ద బరువులాగా తోచింది. ఏమాత్రం ఇష్టం కాలేదు. పనిలో అస్సలు మనసు నిలవలేదు. దాంతో ఆ పని అరకొర వేగంతో, దాని ఇష్టం వచ్చినట్లు అది సాగింది. నిర్మాణపు క్వాలిటీ కూడా బాగా రాలేదు. కాంట్రాక్టర్ ఆ మార్పులను గమనించాడు, అయినా సర్దుకు పోయాడు.

ఏంచేస్తాం, ఇష్టం లేకుండా చేసే ఏ పని అయినా ఇంతే కదా!” అని అనుకున్నాడు. మధ్య మధ్యలో కాంట్రాక్టరు వచ్చి సలహాలూ, సూచనలూ ఇస్తూనే వచ్చాడు. అయినా మేస్త్రీ వాటిని అన్నిటినీ పెడచెవిన పెట్టాడు. “ఎలాగో ఒకలాగా అయిపోనీ, పని గడిస్తే చాలు” అనుకున్నాడు. కొత్త ఇంట్లో పని పూర్తయ్యే సమయానికి కాంట్రాక్టరు వచ్చి చివరి ఇన్స్పెక్షను చేశాడు. నిర్మాణపు పనితనం బాగాలేదు, చాలా లోపాలు కనబడ్డాయి. ఆయనేమీ ఆశ్చర్యపోలేదు ముందునుండీ చూస్తూనే ఉన్నాడు గద! నిట్టూర్చాడు. ఆపైన మెల్లగా జేబులోంచి తాళాల గుత్తి తీసి, మేస్త్రీ చేతికి ఇస్తూ అన్నాడు.

మిత్రమా.! ఇదిగో, ఈ ఇల్లు ఇక నీదే, ఇంటి తాళాలివిగో, అందుకో, మన స్నేహానికి గుర్తుగా నేను నీకు ఇవ్వదలచిన బహుమతి ఇది అని. మేస్త్రీ నిర్ఘాంతపోయాడు.
ఎంత ఘోరం జరిగిపోయింది! ఈ సంగతి ముందుగానే తెలిసి ఉంటే ఎంత బాగుండేది?
తను ఆ ఇంటి నిర్మాణంలో జీవం పోసి ఉండేవాడే, ఇప్పుడు ఇక చేయగలిగింది ఏమీ లేదు.
లోప భూయిష్టమైన ఈ ఇంట్లో తన శేష జీవితాన్ని గడపాల్సిందే. తన తప్పుల్ని తను ప్రతిరోజూ చూస్తూ, ప్రతిరోజూ సిగ్గుపడుతూ గడపాలి.

అయ్యో..!! ముందుగానే తెలిసి ఉంటే ఎంత బాగుండేదో. ఇప్పుడేమీ చెయ్యలేమే...అని కుమిలిపోయాడు