మార్పు మన నుండే ప్రారంభం కావాలి!
An Old Man Story
Devil Writes
11/19/20241 min read


హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు, భోజనానికి ఎంత తీసుకుంటారు?
యజమాని చెప్పాడు, చేపల పులుసుతో అయితే 50 రూపాయలు, అవి లేకుండా అయితే 20 రూపాయలు.ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులోనుండి నలిగి ,ముడతలుపడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు, నా చేతిలో ఈవే ఉన్నాయి. వీటికి ఎంతవస్తే అంతే పెట్టండిచాలు, ఉత్తి అన్నమైనా ఫరవాలేదు, కాస్త ఆకలి తీరితే చాలు, నిన్నటి నుండి ఏమీ తినలేదు,
ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి, గొంతు వణుకుతోంది, హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు.నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తు నిలబడ్డాను. ఆయన కంటినుంది కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి.వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు.
మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా...?
ఆయన ఆ మాట అడిగిన వ్యక్తివైపు చూసి కళ్ళు వొత్తుకుంటు ఇలాచెప్పారు.
నా గత జీవితం గుర్తుకువచ్చి కన్నీళ్ళు వచ్చాయి, నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి.
ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి, నేను కూడపెట్టిన ప్రతీ పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చుపెట్టాను. దానికోసం నేను నా యవ్వనాన్ని, 28 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను.
అన్నింటికి నా వెన్నుముకై నిలచిన నా భార్య నన్ను ఒంటరివాడినిచేసి ముందే వెళ్లి పోయింది, ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటినుండి నా కొడుకులు, కొడళ్లు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు, వాళ్లకు నేను భారమవ్వడం మొదలైనాను.
ఎంత ఒదిగి ఉంటున్నా , నన్ను వాళ్ళు అంత దూరంపెట్టనారంభించారు, నేను వృద్దుణ్ణి కదా....? కనీసం, నా వయస్సు కైనా గౌరవమివ్వచ్చుకదా....? అదీ ..లేదు..వాళ్లందరు భోజనం చేసిన తరువాతనే నేను భోజనానికి వెళ్లే వాడిని, అయినా అప్పుడు కూడా తిట్లూ, చీత్కారాలు తప్పేవి కావు, భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది, మనవలుకూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ, నాన్న చూస్తే తిడతారనే భయంతో..ఎప్పుడు ఒకటే సతాయింపు ఎక్కడికైనా పొయి బ్రతకవచ్చుకదా అని.
పగలనక, రాత్రనక, చెమటోడ్చి కష్టపడి, కంటినిండా నిద్ర పోకుండా, కడుపునిండా తినకుండా ఆమె, నేను కూడబెట్టిన డబ్బుతో ఒకొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇల్లు, ఆమె జ్ఞాపకాలు, చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనీయడం లేదు.
కానీ ఏం చేయను కోడలి బంగారం దొంగిలించాననే నెపం తో దొంగ అనే ముద్ర వేశారు, కొడుకు కోప్పడ్డాడు, ఇంకా నయం కొట్టలేదు, అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అదికూడా జరగవచ్చు. తండ్రి పై చేయి చేసుకున్న కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదని, బయటకు వచ్చాను.
నాకు చావంటే భయం లేదు, అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరికోసం బ్రతకాలి, ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు. తనవద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు.
యజమాని వద్దు చేతిలో ఉండనివ్వండి అన్నాడు, ఎప్పుడైనా మీరు ఇక్కడకు రావచ్చు, మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది. ఐతే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడపెట్టి చెప్పాడు, చాలా సంతోషం, మీ ఉపకారానికి.
ఏమి అనుకోకండి, ఆత్మాభిమానం, నన్ను విడవటంలేదు. వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకుని గమ్యంతెలియని బాటసారిలా వెళ్ళిపోయాడు.
ఆ వ్యక్తి నా మనసుకి చేసిన గాయం నేటికీ మానలేదు. అందుకే అంటారు ప్రతీ పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండు టాకు అవుతుందని, పండుటాకులాంటి ఆ పెద్దలను పువ్వులలో పెట్టి చూసుకోవాలని, లేకుంటే మనకు అటువంటి ఒకరోజు వస్తుందని ఎవరు చింతించడం లేదు..?
Who we are
At Telugu Content Crafters, we unite creators dedicated to producing engaging digital content in Telugu, spanning videos, blogs, film criticism and Social Media content etc.
Contact us
© 2024. All rights reserved.
Follow us